# Tags
#తెలంగాణ #జాతీయం

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ :

ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం…

  • ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో చూడండి
  • జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం
  • కరీంనగర్-హసన్ పర్తి నూతన రైల్వే లేన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం
  • రూ.1480 కోట్ల వ్యయమవుతుందని డీపీఆర్ సిద్ధమైంది
  • కరీంనగర్ తిరుపతి రైలు వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా
  • కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం, ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి

గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివ్రుద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమ్రుత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు.

కరీంనగన్ నుండి హసన్ పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వే లేన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి రూ.1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతోపాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ, సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంజయ్ తోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా ‘‘అమృత్ భారత్’’ పథకం కింద ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం అంటూ… దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల వ్యయంతో 1350 రైల్వే స్టేషన్లను ‘‘అమృత్ భారత్’’ పథకం కింద ఆధునీకరిస్తున్నం… వీటిలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించుకోవడం సంతోషం అని అన్నారు.

మీకు తెలుసు… గతంలో, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో తెలుసు. బీఆర్ఎస్ పాలనలో లేఖలకే పరిమితమయ్యారే తప్ప చేసిందేమీ లేదు. లేఖలు రాసి దులుపుకోవడం కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి. ఈ రోజు రైల్వే స్టేషన్ లో సదుపాయాలను చూసి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.

ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతుంది… ఈ మూడు రంగాల అభివ్రుద్ధి తరువాతే అమెరికా అగ్రరాజ్యమైంది. ఇది గమనించే రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారనీ … మోదీ పట్టుదల, అకుంఠిత దీక్షవల్లే రైల్వే స్టేషన్ల రూపురేఖలన్నీ మారిపోతున్నయని ఇది మనకు గర్వకారణం అన్నారు.

మోదీ పాలనలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో 20కి పైగా ప్రాజెక్టులు… 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టినం. ఒక్క తెలంగాణలోనే 42 వేల 119 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్లులకు 5 వేల 337 వేల కోట్ల రూపాయలు కేటాయించినమని అన్నారు.

కరీంనగర్ రైల్వే స్టేషన్ గతానికి, ఇప్పటికీ ఉన్న తేడా చూడండి… రూ.27 కోట్లకుపైగా వెచ్చించి ఆధునీకరణ పనులు పూర్తి చేసినంక స్టేషన్ రూపురేఖలే మారిపోయినావి… ఎయిర్ పోర్టును తలపిస్తోంది… లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్‌ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్‌ ఏసీ హాల్స్, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, టాయిలెట్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్, రోడ్డు అభివృద్ధి, ప్లాట్‌ఫారం షెల్టర్‌ల ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. రాత్రిపూట ఇంకా అందంగా కన్పిస్తోంది. ప్రజలంతా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చునని అన్నారు.

వాస్తవానికి కరీంనగర్ తోపాటు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చాలని గతంలో రైల్వే మంత్రిని కోరాం…తొలుత కరీంనగర్ కు ఒప్పుకున్నారు. వచ్చేసారి జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చుతామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఆ దిశగా కృషి చేస్తాననీ, వచ్చే నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో ఒక లైన్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు.

హసన్ పర్తి కరీంనగర్ రైల్వే లేన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే నిర్వహించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించాం…61 కి.మీల మేరకు ఈ రైల్వే లేన్ ను నిర్మించడానికి రూ.1480 కోట్లు వ్యయమవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారు. దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు.

కరీంనగర్ నుండి తిరుపతి రైలు ప్రతిరోజు నడిపేలా చూడాలని గతంలో నేను కేంద్ర రైల్వే మంత్రిని కోరాను. సాంకేతిక సమస్యలవల్ల సాధ్యం కాలేదు. వారానికి రెండుసార్లు ట్రైన్ నడిపేందుకు అంగీకరించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. సాంకేతిక ఇబ్బందులను అధిగమించి వారానికి నాలుగుసార్లు నడిపేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.